Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌కు భారీ ఊరట.. ఆంక్షలు ఎత్తివేసిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ.. అసలు వివాదం ఏంటంటే?
అసలు వివాదం ఏంటంటే?

Ranveer Singh: బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్‌కు, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కు మధ్య నడుస్తున్న వివాదం ఊహించని మలుపు తిరిగింది. రణ్‌వీర్‌పై గతంలో జారీ చేసిన'సహాయ నిరాకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధికారికంగా ప్రకటించింది. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ , ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. అయితే రణ్‌వీర్ సింగ్ ఫెడరేషన్‌కు లీగల్ నోటీసు పంపిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
చర్చలకు రండి.. రణ్‌వీర్‌కు ఆహ్వానం..
ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ మాట్లాడుతూ.. రణ్‌వీర్ సింగ్ పంపిన లీగల్ నోటీసు తమకు అందిందని, దానికి తమ లీగల్ టీమ్ సమాధానం ఇస్తుందని చెప్పారు. "ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి రణ్‌వీర్‌ను చర్చలకు ఆహ్వానిస్తున్నాం. ఆయన స్టార్‌డమ్‌ను మేం గౌరవిస్తాం. చట్టపరంగా ఎవరినీ నిషేధించే అధికారం మాకు లేదు. రణ్‌వీర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
వివాదానికి కారణం ఇదే
ఫర్హాన్ అక్తర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాల్సిన డాన్ 3 సినిమా ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ సింగ్ చివరి నిమిషంలో తప్పుకోవడమే ఈ గొడవకు కారణం. గత ఏడాది డిసెంబర్‌లో ధురంధర్ సినిమా విడుదలైన తర్వాత రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మే 25న ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఆయనపై సహాయ నిరాకరణ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ చర్యను పరిశ్రమలోని పలువురు సినీ ప్రముఖులు తప్పుబట్టారు.
నష్టపోతున్న నిర్మాతలు: ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆందోళన
ఈ వివాదం నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా స్పందించింది. నటీనటులు, టెక్నీషియన్లు అడ్వాన్సులు తీసుకుని, చివరి నిమిషంలో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం వల్ల నిర్మాతలు భారీగా ఆర్థిక నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించాల్సిన డాన్ 3 నుంచి రణ్‌వీర్ సింగ్ తప్పుకోవడం, పనోరమా స్టూడియోస్ నిర్మించాల్సిన దృశ్యం 3 నుండి నటుడు అక్షయ్ ఖన్నా వైదొలగడం..
లాంటి సంఘటనల వల్ల ఆయా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేసింది. ఇలాంటి ధోరణి పరిశ్రమలో వృత్తి నైపుణ్యాన్ని , నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించింది.
కోర్టుకెక్కిన వివాదం
మరోవైపు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రముఖ నిర్మాత, ఐఎంపీఏఏ మాజీ అధ్యక్షుడు టీపీ అగర్వాల్ కోర్టును ఆశ్రయించారు. ఏ వ్యక్తిని లేదా సంస్థను బహిష్కరించే హక్కు ఏ ట్రేడ్ బాడీకి లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై కూడా కోర్టులో తాము చట్టపరంగానే ఎదుర్కొంటామని అశోక్ పండిట్ స్పష్టం చేశారు. ఏదేమైనా రణ్‌వీర్‌పై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. బాలీవుడ్‌లో ఈ వివాదం చుట్టూ న్యాయపరమైన, పరిశ్రమపరమైన చర్చలు మాత్రం గట్టిగానే నడుస్తున్నాయి.

