లొంగిపోయిన సిద్ధార్థ్

Major Twist in Pratyusha Case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో నేడుఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిందితుడు సిద్ధార్థ రెడ్డి సోమవారం (మార్చి 16) హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసిన సంగతి తెలిసిందే. గతంలో తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో ఆయన ఈరోజు నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎదుట హాజరయ్యారు. కోర్టు ప్రక్రియ ముగిసిన అనంతరం పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు (ఫిబ్రవరి 24) ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఇది హత్య అని ఆరోపిస్తూ సుదీర్ఘ కాలం న్యాయపోరాటం చేశారు. 2004లో ట్రయల్ కోర్టు సిద్ధార్థకు 5 ఏళ్ల శిక్ష విధించగా, హైకోర్టు దానిని రెండేళ్లకు తగ్గించింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసులో తుది తీర్పునిస్తూ సిద్ధార్థ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా నిర్ధారించింది.సుదీర్ఘ కాలం తర్వాత నిందితుడు శిక్ష అనుభవించబోతుండటంపై ప్రత్యూష తల్లి , న్యాయ నిపుణులు ఇది న్యాయం గెలిచిన రోజని అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story