Actress Jacqueline: రూ. 215 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తాను 'అప్రూవర్' (సాక్షి)గా మారాలని అనుకుంటున్నట్లు ఆమె ఢిల్లీ కోర్టుకు వెల్లడించారు. అయితే, దీనిపై నేరుగా నిర్ణయం తీసుకోవడం కుదరదని, ముందుగా ఈ అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అధికారికంగా తెలియజేయాలని కోర్టు ఆమెకు సూచించింది.

సాధారణంగా ఎవరైనా అప్రూవర్‌గా మారాలంటే, ముందుగా దర్యాప్తు సంస్థ వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత, సదరు వ్యక్తిని సాక్షిగా మార్చవచ్చని భావిస్తే, అప్పుడు ఏజెన్సీ కోర్టులో దరఖాస్తు చేసుకుంటుంది. తనపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయాలని జాక్వెలిన్ గతంలో సుప్రీంకోర్టును కోరినప్పటికీ, అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ కొత్త అడుగు వేసినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ తామిద్దరం ప్రేమలో ఉన్నామని చెబుతూ తరచూ జాక్వెలిన్‌కు ప్రేమ లేఖలు రాస్తుంటారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా గతంలో బయటకు వచ్చాయి. అయితే, సుకేశ్ ఒక మోసగాడని తనకు తెలియదని, అతనొక పెద్ద వ్యాపారవేత్త అని నమ్మించి తనను బురిడీ కొట్టించాడని జాక్వెలిన్ కోర్టులో వాదిస్తున్నారు. అతని నేర నేపథ్యం గురించి తనకు అస్సలు తెలియదని ఆమె స్పష్టం చేశారు.

కానీ ఈడీ అధికారులు మాత్రం జాక్వెలిన్ వాదనను తోసిపుచ్చుతున్నారు. సుకేశ్ చేస్తున్న నేరాల గురించి తెలిసి కూడా ఆమె అతని నుంచి దాదాపు రూ. 7 కోట్ల విలువైన ఖరీదైన నగలు, బట్టలు, కార్లను బహుమతులుగా తీసుకున్నారని ఆరోపిస్తూ 2022 ఆగస్టులోనే ఆమెను ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. సుకేశ్ అరెస్ట్ అయిన తర్వాత జాక్వెలిన్ తన ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశారని, విచారణ ప్రారంభంలో నిజాలు దాచిపెట్టి సాక్ష్యాలు చూపించిన తర్వాతే ఒప్పుకున్నారని ఈడీ పేర్కొంది. అధికారి హోదాలో ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పి సుకేశ్ చేసిన ఈ భారీ కుంభకోణంలో జాక్వెలిన్ పాత్రపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story