Malayalam Actor Kalabhavan Nawas: అనుమానాస్పద స్థితిలో మలయాళ నటుడు మృతి
మలయాళ నటుడు మృతి

Malayalam Actor Kalabhavan Nawas: ప్రముఖ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ (51) శుక్రవారం సాయంత్రం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న ఒక హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నవాస్ మలయాళ చిత్ర పరిశ్రమలో సుపరిచితులు. ఆయన తన నటనతో, ముఖ్యంగా మిమిక్రీ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మరణం సినీ పరిశ్రమలో, అభిమానులలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మృతిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నవాస్ ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడ బసచేస్తుండగా, నిర్ణీత సమయానికి చెక్‌ఔట్ చేయకపోవడంతో హోటల్ సిబ్బంది అతని గదికి వెళ్లారు. అతన్ని అపస్మారక స్థితిలో చూసి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నవాస్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. అతని గదిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని తెలిపారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి శనివారం కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
