Malayalam Beauty Anaswara Rajan: మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటి అనస్వర రాజన్.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా మారుతోంది. మలయాళ భామ మమిత బైజు తర్వాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న మరో హీరోయిన్‌గా అనస్వర పేరు వినిపిస్తోంది. కేవలం 24 ఏళ్ల వయసులోనే టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.

‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనస్వర.. ఇందులో రోషన్ మేకాకు జోడీగా నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం అనస్వర ‘ఇట్లు అర్జున’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అనీష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల నిర్మాత. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘అంతా రాములోరు చూసుకుంటారు’ అనే విలేజ్ డ్రామాలోనూ అనస్వర హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె కథానాయిక పాత్రల్లో కనిపించనుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాలోనూ అనస్వర కీలక పాత్ర పోషిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి కుమార్తెగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూడు సినిమాలు తక్కువ వ్యవధిలోనే విడుదలకు రానుండటంతో తెలుగులో అనస్వరకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

ఇక రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలోనూ అనస్వరను ఓ కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా.. అనస్వరకు ముఖ్యమైన పాత్ర దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇలా యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా మాత్రమే కాకుండా.. సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు, కుమార్తె పాత్రలు చేస్తూ అనస్వర తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని విభిన్నంగా ఉపయోగించుకుంటోంది. దీంతో రాబోయే రోజుల్లో తెలుగులో ఈ మలయాళ బ్యూటీ మరింత బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story