మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

Dadasaheb Phalke Award: మలయాళ సినిమా అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. శనివారం కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఎక్స్‌లో పోస్ట్‌ చేసి ఈ విషయాన్ని తెలిపింది. 2023 సంవత్సరానికి గాను మోహన్‌లాల్‌ ఈ అవార్డును అందుకోనున్నారు.

నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ సినిమాకు అందించిన సేవలను కేంద్రం ప్రశంసించింది. మోహన్‌లాల్‌ ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారత సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని కొనియాడింది. సెప్టెంబరు 23న జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు.

మోహన్‌లాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ మోహన్‌లాల్‌ నట వైవిధ్యాన్ని ప్రశంసించారు. మలయాళ సినిమాకు దివిటీలా నిలిచారని కొనియాడారు. మలయాళమే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అద్భుత పాత్రలు పోషించి స్ఫూర్తినిచ్చారని అన్నారు. మరో మలయాళ స్టార్‌ మమ్ముట్టి కూడా మోహన్‌లాల్‌కు అభినందనలు తెలిపారు. మోహన్‌లాల్‌ తనకు సోదరుడిలాంటి వారని, ఆయన సినీ ప్రయాణానికి ఈ అవార్డు తగిన గుర్తింపు అని అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story