ఒక్క మెసేజ్‌తో దొరికిపోయిన ఐబొమ్మ రవి

iBomma Ravi: ఐబొమ్మ కేసులో అరెస్టయిన నిందితుడు ఇమంది రవి విచారణలో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై ఎంత పట్టున్నా, కేవలం తన స్నేహితుడికి పంపిన ఒక్క మెసేజ్‌ కారణంగానే సైబర్ క్రైమ్ పోలీసులకు దొరికిపోయినట్లు తేలింది. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే ఇమంది రవి, హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి తన పాత స్నేహితుడితో కలిసి పార్టీలు చేసుకునేవాడు. తాజాగా, రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఆ మిత్రుడికి... "మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం" అంటూ మెసేజ్ పంపాడు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఈ-మెయిల్ లింకులు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా రవి స్నేహితుడి ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో రవి పంపిన ఒక్క మెసేజ్ ఆధారంగానే పోలీసులు నగరంలో అతని కదలికలను నిర్ధారించుకుని, వెంటనే వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణలో నిందితుడు రవి పోలీసులకు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, పోలీసులు కేసులో కీలక విషయాలు రాబట్టేందుకు రవిని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని కోరుతూ కోర్టులో కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story