Mangli in Trouble: సింగర్ మంగ్లీకి చిక్కులు.. మైక్రోఫైనాన్స్ మోసంలో వెలుగులోకి మనీ ట్రైల్!
మైక్రోఫైనాన్స్ మోసంలో వెలుగులోకి మనీ ట్రైల్!

Mangli in Trouble: ప్రముఖ సింగర్ మంగ్లీ చుట్టూ మైక్రోఫైనాన్స్ మోసం కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో జరుగుతున్న విచారణలో మంగ్లీ కుటుంబానికి చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ పరిణామం ఆమెకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
మైక్రోఫైనాన్స్ పేరుతో జరిగిన ఈ మోసంలో ప్రధాన నిందితుడి బ్యాంక్ ఖాతా నుండి మంగ్లీ సోదరుడి ఖాతాకు నగదు బదిలీ అయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, ఈ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పలు బ్యాంకులను సంప్రదించారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామావత్ మధు బ్యాంక్ ఖాతాను పోలీసులు స్తంభింపజేశారు.
హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తి అడ్వకేట్ సుబ్బారావు ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మైక్రోఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్ స్కీమ్ ల పేరుతో తనను కోట్లాది రూపాయలు మోసం చేశారని, ఇందులో మంగ్లీ మరియు ఆమె సోదరుడి ప్రమేయం కూడా ఉందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ ఇప్పటికే ఖండించారు. ప్రస్తుతానికి పోలీసులు నిధుల వేటలో ఉండటంతో, రాబోయే రోజుల్లో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

