మనోజ్ బాజ్‌పేయీ సంచలన వ్యాఖ్యలు..

Manoj Bajpayee Makes Sensational Comments: విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయీ.. బాలీవుడ్ సినీ పరిశ్రమలోని ప్రస్తుత వాతావరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ పరిశ్రమలో నటీనటుల మధ్య అభద్రతాభావం తీవ్రంగా పెరిగిపోయిందని, ఒకరినొకరు ప్రోత్సహించుకునే, ప్రశంసించుకునే సంస్కృతి కొరవడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పోలీస్ స్టేషన్ మే భూత్ చిత్రంలో నటిస్తున్న మనోజ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశాలపై మాట్లాడారు.

"ప్రశంసించుకునే వాతావరణం లేదు" బాలీవుడ్‌లో ఒకరి పనిని మరొకరు మెచ్చుకునే సంస్కృతి పూర్తిగా తగ్గిపోయింది. కనీసం ఒక సినిమా బాగుందని చెప్పడానికి ఫోన్ చేసి మాట్లాడేవారు కూడా లేరు. ఇక్కడ అందరిలోనూ అభద్రత బాగా పెరిగిపోయిందని మనోజ్ బాజ్‌పేయీ స్పష్టం చేశారు.

తాను మాత్రం ఈ ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తానని, మంచి పాత్రల కోసం సహచర నటులకు ఫోన్లు చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. అంతేకాకుండా తన సినిమాల గురించి ప్రేక్షకుల నుంచి కూడా తరచుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటానని చెప్పారు. సినీ రంగంలో ఒక నటుడు తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో మనోజ్ వివరించారు. "ఒక సినిమా విజయం సాధించినంత మాత్రాన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. తదుపరి అవకాశం వస్తుందో, రాదో అనే ఆందోళన నిరంతరం నటుడిని వెంటాడుతుంది. విజయం ఉంటేనే అవకాశాలు, లేదంటే నటుడు తన ఉనికిని కోల్పోతాడు" అంటూ బాలీవుడ్‌లో అవకాశాల కోసం జరిగే నిరంతర పోరాటాన్ని ఆయన వెల్లడించారు. హిందీతో పాటు తెలుగు సహా పలు భాషల్లో తనదైన ముద్ర వేసిన మనోజ్ బాజ్‌పేయీ ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, ఇన్‌స్పెక్టర్ జెండే వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story