Rajamouli’s Varanasi: రాజమౌళి 'వారణాసి'కి భారీ OTT డీల్?
'వారణాసి'కి భారీ OTT డీల్?

Rajamouli’s Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులు రికార్డు స్థాయి ధర పలకనున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పాన్-ఇండియన్ మూవీ గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రపంచంలోనే అగ్రగామి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రం అంతర్జాతీయంగా సాధించిన అసాధారణ విజయం, ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం.. 'బాహుబలి 2' విదేశీ వసూళ్ల రికార్డుల కారణంగా రాజమౌళి బ్రాండ్‌కు హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో, ఆయన తదుపరి చిత్రం 'వారణాసి' డిజిటల్ హక్కులకు ఊహించని డిమాండ్ ఏర్పడింది.ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు, 'వారణాసి' డిజిటల్ హక్కుల కోసం స్ట్రీమింగ్ దిగ్గజాలు హాలీవుడ్ సినిమాలకు చెల్లించే స్థాయి మొత్తాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అంతిమంగా, ఈ సినిమా గ్లోబల్ ఓటీటీ హక్కులు దాదాపు రూ. 1000 కోట్లకు అమ్ముడయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ డీల్ ఖరారైతే, థియేట్రికల్ విడుదల కంటే ముందే కేవలం డిజిటల్ హక్కుల ద్వారా ఈ స్థాయిలో ఆదాయం ఆర్జించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా 'వారణాసి' చరిత్ర సృష్టించనుంది. మహేష్ బాబు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయంగా పేరున్న తారలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండడం కూడా ఓటీటీ హక్కులకు ఇంత భారీ ధర పలకడానికి ప్రధాన కారణం. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ భారీ డీల్ వార్త.. అభిమానుల్లో మరియు సినీ వర్గాల్లో తీవ్ర ఉత్సాహాన్ని, సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.

