Amitabh Bachchan: శ్రీకృష్ణుడి భక్తి గీతాన్ని వక్రీకరించిన మీడియా.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan: సోషల్ మీడియాలో తాను పంచుకున్న భక్తి సందేశానికి తప్పుడు అర్థాలు తీసి, వివాదాస్పద శీర్షికలతో ప్రచారం చేసిన ఒక ప్రసార మాధ్యమంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార కథనాలతో తన మాటల అంతరార్థాన్ని మార్చే ప్రయత్నం చేశారంటూ సోమవారం తన ఎక్స్ ఖాతా ద్వారా ఘాటుగా స్పందించారు. అక్టోబర్ 29న అమితాబ్ బచ్చన్ శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఉత్తర భారతంలో ప్రసిద్ధి చెందిన "హాథీ ఘోడా పాల్కీ.. జై కన్హయ్య లాల్ కీ" అనే సాంప్రదాయ భక్తి గీత పంక్తులను పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఒక ప్రముఖ మీడియా సంస్థ వింత విశ్లేషణను తెరపైకి తెచ్చింది. అమితాబ్ తన శత్రువులు లేదా ప్రత్యర్థులనుద్దేశించి పరోక్షంగా సవాల్ విసిరారని, ఏనుగులు, గుర్రాలతో వచ్చినా తాము ఆయుధాలతో పోరాడతామని హెచ్చరించినట్లుగా ఆ పోస్టుకు వక్రభాష్యం చెబుతూ కథనాన్ని ప్రచురించింది.
దైవ సంకీర్తనకు యుద్ధ రంగు పులుముతారా?: బిగ్ బి ఫైర్
ఈ వ్యవహారంపై బిగ్ బి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భగవంతుని నామస్మరణను అవమానించడమే కాకుండా తన వ్యాఖ్యలకు యుద్ధ సంకేతాలు ఆపాదిస్తూ దుష్ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు కథనాలతో పాఠకులను తప్పుదోవ పట్టించడం దారుణమని పేర్కొన్నారు.
5 కోట్ల ఫాలోవర్ల బలం ఉంది.. ఖబడ్దార్
ఈ సందర్భంగా సదరు మీడియా హౌస్కు అమితాబ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. "నాకు సోషల్ మీడియాలో 5 కోట్లకు పైగా ఫాలోవర్ల అండ ఉంది. నేను ఒక్క పిలుపు ఇస్తే అందులో పది శాతం మంది చాలు.. మీ ద్వంద్వ వైఖరిని గట్టిగా నిలదీయడానికి. మీరు నా మాటలను ఎంతగా వక్రీకరిస్తే, దానికి వంద రెట్లు ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త!" అంటూ హెచ్చరించారు. అమితాబ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

