Meenakshi Chaudhary: పెళ్లి పుకార్లకు మీనాక్షి చౌదరి చెక్.. ఆ యువ హీరోతో డేటింగ్ వార్తలపై ఏమన్నారంటే?
ఆ యువ హీరోతో డేటింగ్ వార్తలపై ఏమన్నారంటే?

Meenakshi Chaudhary: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న పెళ్లి వార్తలకు ఘాటుగా సమాధానమిచ్చారు. తన వ్యక్తిగత విషయాలపై నెట్టింట జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. మీనాక్షి చౌదరి ఒక యువ టాలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేశాయి. గతంలో ఆమె ప్రతినిధులు ఈ వార్తలను తప్పుబట్టినప్పటికీ, ప్రచారం ఆగకపోవడంతో తాజాగా ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
ప్రమోషన్లలో అసలు నిజం వెల్లడి
నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి నటించిన అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ల వేదికగా తన పెళ్లి రూమర్లపై మీనాక్షి స్పందించారు. "ప్రతిరోజూ నా పెళ్లి గురించి వస్తున్న అసత్య వార్తలు చూసి విసిగిపోయాను. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎటువంటి వివాహ ప్రకటన చేయలేదని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన అస్సలు లేదని ఆమె కుండబద్ధలు కొట్టారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని.. కథ, పాత్ర బాగుంటే ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికైనా తాను సిద్ధమని తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌ను చాటిచెప్పారు. అనగనగా ఒక రాజు ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇచ్చిన ఈ వివరణతోనైనా ఈ పుకార్లకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.

