Mega 157 Completes Kerala Shoot: మెగా 157 కేరళ షూటింగ్ కంప్లీట్.. టైటిల్ అదేనా.?
టైటిల్ అదేనా.?

Mega 157 Completes Kerala Shoot: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా షూటింగ్ వేగంగా జరగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తవగా..లేటెస్ట్ గా మూడో షెడ్యూల్ కేరళలోని అలప్పుజలో పూర్తయింది. అక్కడ చిరంజీవి, నయనతారపై ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ముచ్చటగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుని మన శంకర ప్రసాద్ గారు హైదరాబాద్ కు వచ్చారని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అందరు సినిమా టైటిల్ మన శంకర వరప్రసాద్ గారు అని అనుకుంటున్నారు.
ఇటీవల షూటింగ్ సెట్ నుంచి అనధికారికంగా వీడియోలు, ఫోటోలు లీక్ అవుతున్నాయని చిత్ర నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, చాలాకాలం తర్వాత చిరంజీవి పూర్తి హాస్యభరితమైన పాత్రలో కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. చిరంజీవి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరు అయిన 'శంకర్ వరప్రసాద్' పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అతను ఒక డ్రిల్ మాస్టర్‌గా కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.సైరా నరసింహారెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.
విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఒక హాస్యభరితమైన అతిథి పాత్రలో మెరవనున్నారు. ఇటీవల వెంకటేష్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
