Mega Mass Combo: మెగా మాస్ కాంబో రిపీట్.. ఏప్రిల్ నుండి షూటింగ్ షురూ..
ఏప్రిల్ నుండి షూటింగ్ షురూ..

Mega Mass Combo: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్యతో రికార్డులు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కబోతోంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై తాజాగా ఆసక్తికర అప్‌డేట్స్ వెలువడ్డాయి. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ రెండో వారం నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
అట్టహాసంగా ప్రారంభోత్సవం:
ఈ నెలాఖరులోగా సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి షెడ్యూల్‌లోనే చిరంజీవిపై కొన్ని పవర్‌ఫుల్ సోలో ఎంట్రీ సీన్స్‌తో పాటు, ఒక అదిరిపోయే మాస్ సాంగ్ చిత్రీకరించాలని దర్శకుడు బాబీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
మాస్ ప్లస్ ఎమోషన్.. సరికొత్త అవతార్:
ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో మెప్పించిన మెగాస్టార్, ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. "కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ బాబీ ఈ కథను సిద్ధం చేశారు." అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవిని గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేయాలనే లక్ష్యంతో బాబీ ఈ కథను రూపొందించినట్లు సమాచారం.

