Mega Update From Kaka: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కాకా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి ముద్దుల కుమార్తెగా నటిస్తున్న మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఆమె అమ్ములు అనే కీలక పాత్రలో మెప్పించనుంది.

ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

విడుదలైన పోస్టర్‌లో అనశ్వర రాజన్ వైద్య విద్యార్థినిగా ఎంతో పక్కింటి అమ్మాయిలా, అమాయకమైన చిరునవ్వుతో కనిపిస్తోంది. ఆమె వెనుక చిరంజీవి ఒక రక్షణ కవచంలా నిలబడిన నీడను చూపించిన విధానం సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే గాఢమైన ప్రేమ, అనుబంధాన్ని ఈ లుక్ అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. కథను మలుపు తిప్పే కీలకమైన ఎమోషన్స్ ఈ పాత్ర చుట్టూనే తిరుగుతాయని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

మెగా ఛాన్స్ కొట్టేసిన అనశ్వర రాజన్

మలయాళ చిత్రసీమలో తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్న అనశ్వర, ఛాంపియన్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి భారీ చిత్రంలో ఆయన కూతురిగా నటించే అవకాశం దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు మైలురాయిగా మారనుంది.

సంక్రాంతి బరిలో మెగా సందడి

దర్శకుడు బాబీ కొల్లి-చిరంజీవి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భావోద్వేగాలతో పాటు అభిమానులను ఉర్రూతలూగించే మాస్ యాక్షన్ అంశాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఈ భారీ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Next Story