‘Peddi’ Release: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య నలుగుతున్న పర్సంటేజ్ సిస్టమ్ వివాదం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరక పరిశ్రమ సంక్షోభంలో పడేలా కనిపించడంతో.. టాలీవుడ్ పెద్దన్నగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు నేడు సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దీంతో ఫిలింనగర్ వర్గాల్లో ఈ మెగా భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

అసలు ఏమిటీ పర్సంటేజ్ వివాదం?

ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో సినిమా కలెక్షన్ల ఆధారంగా నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు పర్సంటేజ్ పంచుకుంటున్నాయి. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రం సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పాత పద్ధతిలోనే అద్దె చెల్లిస్తున్నారు. దీనిపైనే ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎగ్జిబిటర్ల ఆవేదన:

ఓటీటీల ప్రభావం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గడం, మరోవైపు భారీగా పెరిగిన కరెంట్ బిల్లులు, థియేటర్ల నిర్వహణ ఖర్చులతో సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆందోళన చెందుతున్నారు.

డిమాండ్:

సినిమా ఫ్లాప్ అయినా తాము లక్షల్లో ఫిక్స్‌డ్ అద్దెలు కట్టలేక అప్పుల పాలవుతున్నామని.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లే తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్ల ఆధారంగా రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రామ్ చరణ్ పెద్ది విడుదలపై ముంచుకొస్తున్న గండం..

ఈ వివాదం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం పెద్ది విడుదలపై నేరుగా ప్రభావం చూపేలా ఉంది. వచ్చే నెల 4న భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచే పర్సంటేజ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం అల్టిమేటం జారీ చేసింది. అలా చేయని పక్షంలో థియేటర్లలో సినిమాను ప్రదర్శించేది లేదని వారు హెచ్చరించారు. గతంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఎగ్జిబిటర్లు తమ పట్టు వీడటం లేదు.

టికెట్ ధరల పెంపుపై అభ్యంతరం:

దీనికి తోడు పెద్ది సినిమాకు టికెట్ ధరల పెంపును కూడా ఎగ్జిబిటర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే రేట్లు భారీగా పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని, ఈ విషయంపై తాము ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశామని వారు స్పష్టం చేస్తున్నారు.

చిరంజీవి చొరవతో సమస్యకు మోక్షం లభించేనా?

టాలీవుడ్‌లో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండే మెగాస్టార్ చిరంజీవి.. ఇటు తన కుమారుడు రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విడుదల ఇరకాటంలో పడటం, అటు వందలాది సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల భవిష్యత్తు ప్రమాదంలో ఉండటాన్ని గమనించి ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి నడుం బిగించారు. నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో మాట్లాడి, ఇటు నిర్మాతలకు నష్టం జరగకుండా, అటు ఎగ్జిబిటర్లకు న్యాయం జరిగేలా ఒక సరైన మధ్యేమార్గాన్ని చిరంజీవి సూచిస్తారని ఇండస్ట్రీ వర్గాలు బలంగా ఆశిస్తున్నాయి. నేడు జరగబోయే ఈ కీలక సమావేశం తర్వాతైనా వివాదానికి తెరపడి, జూన్ 4న పెద్ది చిత్రం సులువుగా థియేటర్లలోకి వస్తుందో లేదో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story