Megastar Chiranjeevi: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సృష్టిస్తున్న చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తుండగా, ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ చిత్రశైలిని కొనియాడారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ హిట్ సినిమాపై రివ్యూ ఇస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పరిశ్రమ అందరిది.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి' అంటూ చిరంజీవి రాసుకొచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక సినిమా విజయం సాధిస్తే చిత్రపరిశ్రమలో అందరికీ పండగే అని ఆయన అన్నారు.

ఇక చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ... 'నాకెంతో ఇష్టమైన సోదరుడు రవితేజకు అభినందనలు. సినిమాను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఆస్వాదించా. రవితేజ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా బాధ్యతను దర్శకుడు శివ నిర్వాణ తన భుజాలపై వేసుకుని గొప్పగా తీర్చిదిద్దారు. సున్నితమైన భావోద్వేగాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన బాలనటి నక్షత్రకు గొప్ప భవిష్యత్ ఉండాలి' అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్‌పై స్పందించిన రవితేజ.. 'అన్నయ్యా థాంక్యూ..' అంటూ హార్ట్ ఎమోజీలతో కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు 'ఇరుముడి' మేనియా థియేటర్లలో ఏ మాత్రం తగ్గడం లేదు. విడుదలైన నాటి నుంచి హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్న ఈ సినిమా, ఆరో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. కొన్ని థియేటర్లలో వేరే సినిమాలను తీసేసి మరీ 'ఇరుముడి' వేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తుండగా... మరికొన్ని చోట్ల సీట్లు సరిపోక కుర్చీలు వేసుకుని మరీ సినిమా చూస్తున్నారు. మొత్తానికి రవితేజ 'ఇరుముడి' టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది.

Next Story