Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసు.. సర్వత్రా ప్రశంసలు
సర్వత్రా ప్రశంసలు

Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద మనసుతో మరోసారి అందరి మనసులను గెలుచుకున్నారు. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన ఎంత గొప్ప వ్యక్తనేదానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. 'మెగా 158' సినిమా షూటింగ్ సెట్స్‌లో జరిగిన ఒక హృద్యమైన సంఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి చూపిన మానవత్వంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
వివరాల్లోకి వెళితే, 'మెగా 158' చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్స్‌లో కెమెరా డిపార్ట్‌మెంట్‌లో నివాస్ అనే యువకుడు టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతనికి పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ నివాస్ తన కొడుకుకి 'జస్వంత్ రామ్ చరణ్' అని పేరు పెట్టుకున్నాడు. ఈ విషయం సెట్స్‌లో పనిచేస్తున్న కొందరి ద్వారా మెగాస్టార్ దృష్టికి వెళ్ళింది.
తనపై ఉన్న అభిమానంతో చిన్నారికి అలా నామకరణం చేశారని తెలుసుకున్న చిరంజీవి చలించిపోయారు. వెంటనే ఆ టెక్నీషియన్ నివాస్ మరియు అతని కుటుంబ సభ్యులను తన నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారిని ఆప్యాయంగా పలకరించి, బాలుడిని ఆశీర్వదించారు. అంతేకాకుండా వారిని సత్కరించి, విలువైన బహుమతులు అందజేయడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చిరంజీవి చూపిన ఈ గొప్ప చొరవ, సాటి కార్మికుల పట్ల ఆయన చూపే ఆప్యాయత నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు సెట్స్‌లో ఉంటేనే పెద్ద విషయంగా భావిస్తారు, అలాంటిది ఒక సాధారణ టెక్నీషియన్ కుటుంబానికి తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి సత్కరించడం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ కేవలం నటుడే కాదు, నిజమైన మనసున్న మహారాజు అంటూ నెటిజన్లు ఈ ఘటనను కొనియాడుతున్నారు.

