Miss Universe: మెక్సికో బ్యూటీకి మిస్ యూనివర్స్ కిరీటం
మిస్ యూనివర్స్ కిరీటం

Miss Universe: ఇవాళ నవంబర్ 21న ఉదయం జరిగిన మిస్ యూనివర్స్ 2025 (Miss Universe 2025) పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. ఆమె ఈ కిరీటాన్ని గెలుచుకున్న నాల్గవ మెక్సికన్ మహిళ.తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలీ నిలిచారు. దీంతో గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్.. ఫాతిమాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు.
ఫాతిమా బాష్ ఒక ప్రొఫెషనల్ మోడల్‌తో పాటు, ఆమెకు విద్యా నేపథ్యం కూడా ఉంది. ఆమె యువతకు ఆదర్శంగా నిలిచేలా సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేశారు. మెక్సికో తరఫున మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న నాల్గవ మహిళ ఈమె. మెక్సికోకు ఈ విజయం దక్కడం దేశానికి గొప్ప గౌరవంగా భావిస్తున్నారు.ఈ పోటీలో అత్యంత కీలకమైన రౌండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ లో ఫాతిమా ఇచ్చిన సమాధానం న్యాయనిర్ణేతలను , ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సామాజిక మార్పు , మహిళా సాధికారతపై ఆమె దృక్కోణాన్ని స్పష్టంగా తెలియజేశారు.
ఈ అందాల పోటీల్లో భారత్ తరపున పాల్గొన్న రాజస్థాన్ కు చెందిన మణిక విశ్వకర్మ ప్రిలిమినరీ రౌండ్‌లో , స్విమ్‌సూట్ రౌండ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చి టాప్ 30 వరకు చేరుకోగలిగారు. కానీ టాప్ 12 ఫైనలిస్ట్‌ల జాబితాలోకి ప్రవేశించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం భారత్‌కు దక్కలేదు.

