‘Mirzapur: ఓటీటీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సంచలన వెబ్ సిరీస్ 'మీర్జాపుర్' ఇప్పుడు వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది! రక్తసిక్తమైన రాజకీయాలు, మాఫియా సామ్రాజ్యపు కుట్రలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ క్రేజీ ప్రాంచైజీ.. ఇప్పుడు 'మీర్జాపుర్: ది మూవీ' పేరుతో థియేటర్లలోకి దూసుకొస్తోంది. సెప్టెంబరు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్రంలో అభ్యంతరకరంగా ఉన్న 6 డైలాగులను మార్చడంతో పాటు, కొన్ని రక్తపాత దృశ్యాలను తొలగించాలని నిర్మాణ సంస్థకు సూచించింది. దీంతో మొత్తంగా 35 సెకన్ల నిడివిగల విజువల్స్ ను మేకర్స్ తొలగించారు. అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పీక్స్ లో ఉండే యాక్షన్, వయొలెన్స్ ఏమాత్రం తగ్గవని తెలుస్తోంది. మొత్తంగా 197 నిమిషాల భారీ రన్ టైమ్ తో ఈ సినిమా థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది.

వెబ్ సిరీస్ లో ప్రాణాలు కోల్పోయిన పాత్రలు కూడా ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాయనే ప్రచారం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రసికా దుగల్ వంటి అగ్ర తారాగణం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి.. వెబ్ సిరీస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించిన గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. మరి సిరీస్ లాగే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి!

Next Story