ప్రముఖ యువ నటి మృతి

Model Harshil Kalia: రాజస్థాన్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన అందం, అభినయంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ నటి, ప్రముఖ మోడల్ హర్షిల్ కాలియా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్ధరాత్రి ఆమె ప్రయాణిస్తోన్న కారు జైపూర్‎లోని షిప్రా పాత్ రోడ్డుపై డివైడర్‎ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షిల్ కాలియా అక్కడికక్కడే కన్నుమూసింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ తలకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కేవలం 30 ఏళ్ల ప్రాయంలోనే ఆమె మరణించడం ఇటు సినీ వర్గాలను, అటు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

అతి వేగమో లేక అదుపు తప్పడమో.. కారణం ఏదైనా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఘటనా స్థలంలోనే ఆమె కన్నుమూశారని తెలియడం అందరినీ కలిచివేస్తోంది. నిన్నటి వరకు షూటింగులతో, ఫొటోషూట్‌లతో బిజీగా గడిపిన హర్షిల్.. నేడు విగతజీవిగా పడి ఉండటం ఎవరూ నమ్మలేకపోతున్నారు.

మోడలింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్షిల్ కాలియా, రాజస్థానీ చిత్ర పరిశ్రమలో ప్రామిసింగ్ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్, యాడ్ ఫిల్మ్స్‌లో నటించి మెప్పించారు. నటిగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన సమయంలో, విధి ఆడిన వింత నాటకానికి ఆమె బలైపోయారు. ఆమె మరణవార్త విన్న రాజస్థానీ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story