Megastar’s Movie: మెగాస్టార్ మూవీలో మోహన్‌లాల్!
మోహన్‌లాల్!

Megastar’s Movie: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ ప్రాజెక్ట్ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూనే, బలమైన ఎమోషనల్ బేస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో మలయాళ దిగ్గజం మోహన్‌లాల్ ఒక కీలక పాత్రలో నటించనున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఇద్దరు లెజెండరీ నటులను ఒకే స్క్రీన్‌పై చూడటం ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ కానుంది.
మరోవైపు, ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవిక మోహనన్ నటిస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. "చిరంజీవి సార్‌తో నటించడం నాకు ఇష్టమే కానీ, ప్రస్తుతం నేను ‘మెగా 158’ ప్రాజెక్ట్‌లో భాగం కాదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు" అని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మోహన్‌లాల్, చిరంజీవిల మధ్య ఒక ఆసక్తికరమైన 'లూసిఫర్' కనెక్షన్ ఉంది. మోహన్‌లాల్ నటించిన మలయాళ హిట్ ‘లూసిఫర్’ను చిరంజీవి తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఒరిజినల్ వెర్షన్‌లోని కొన్ని అంశాలు తనకు పూర్తిగా నచ్చలేదని, దర్శకుడు మోహన్ రాజా స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసిన తర్వాతే తాను ఈ సినిమా చేసేందుకు మొగ్గు చూపానని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసినప్పటికీ, ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ‘మెగా 158’ ద్వారా ఈ ఇద్దరు స్టార్స్ నేరుగా కలిసి నటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

