టీవీ నుంచి ఓటీటీ, సినిమాల వరకు ప్రయాణం… ప్రయోగాలే విజయానికి కారణమంటున్న మోనా సింగ్

ప్రముఖ నటి మోనా సింగ్ తన తాజా వెబ్ సిరీస్ మా కా సుమ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీవీతో తన కెరీర్ ప్రారంభించిన మోనా, ఇప్పుడు సినిమాలు, ఓటీటీ వేదికలపై తన ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నానని ఆమె ఆనందంగా చెప్పారు. మోనా సింగ్ మాట్లాడుతూ, తన ప్రాజెక్టులు వరుసగా విడుదల అవుతుండటం తనకే ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. ప్రతి ప్రాజెక్ట్‌కు తనదైన సమయం, అదృష్టం ఉంటుందని ఆమె నమ్మకం. “నా 20లలో ప్రారంభమైన నా ప్రయాణం ఇప్పుడు 40లలో కొత్త ప్రయోగాలతో కొనసాగుతోంది. సినిమాలు, ఓటీటీ అన్నీ కలిసి జరుగుతున్నాయి. ఇది నేను ఎప్పటినుంచో కోరుకున్న దశ,” అని ఆమె చెప్పారు.

అన్ని రకాల పాత్రలు..

తన కెరీర్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరుల సలహాలు తీసుకున్నా, చివరికి తానే నిర్ణయం తీసుకుంటానని మోనా వివరించారు. “నాకు సవాల్‌గా అనిపించే కథలే నాకు ఎక్కువగా నచ్చుతాయి. కొంచెం భయపెట్టే, కొత్తగా అనిపించే పాత్రలే నాకు ఆసక్తి కలిగిస్తాయి,” అని ఆమె చెప్పారు. ఇప్పటివరకు ఎక్కువగా ‘గుడ్ గర్ల్’ పాత్రలలో కనిపించిన మోనా, ఇప్పుడు నెగటివ్ లేదా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మహిళలు అన్ని రకాల పాత్రలు చేయగలరని ఆమె స్పష్టం చేశారు. “మహిళలను ఎప్పుడూ బలహీనంగా చూపించాల్సిన అవసరం లేదు. వాళ్లు బలంగా, విభిన్నంగా కనిపించవచ్చు,” అని ఆమె అన్నారు.

కొత్త అవకాశాలు..

టీవీ నుంచి సినిమాలు, ఓటీటీకి మారడం గురించి మాట్లాడుతూ మోనా ఆసక్తికర విషయాలు చెప్పారు. “నేను ఎప్పుడూ మీడియం కోసం కాదు, మంచి పని కోసం వెతికాను. టీవీలో కొత్తదనం లేకపోవడంతో కొంత విరామం తీసుకున్నాను. మంచి కథ కోసం ఎదురు చూశాను,” అని తెలిపారు. 2017లోనే ఓటీటీ రంగంలో అడుగుపెట్టడం తన కెరీర్‌కు కొత్త అవకాశాలు తెచ్చిందని చెప్పారు.

Maa Ka Sum సిరీస్ గురించి మాట్లాడుతూ, ఇది తల్లి–కూతురు సంబంధాన్ని కొత్త కోణంలో చూపిస్తుందని మోనా తెలిపారు. “చిన్నప్పుడు కఠినంగా ఉండే తల్లి, తరువాత తన కూతురికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది. నా జీవితంలో కూడా నా అమ్మ ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్, ట్రావెల్ పార్ట్నర్,” అని ఆమె చెప్పింది.

సమాజం అంగీకరించాలి..

ఈ సిరీస్‌లో తల్లి పాత్రను సరికొత్తగా చూపిస్తున్నామని ఆమె వివరించారు. “తల్లి అంటే పిల్లల కోసమే జీవించాలి అనే భావనను మార్చాలని ప్రయత్నిస్తున్నాం. తల్లికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆమె రెండోసారి ప్రేమలో పడితే తప్పేంటి? ఇది సహజమైన విషయం. దీనిని సమాజం అంగీకరించాలి,” అని మోనా అన్నారు. ఇండస్ట్రీలో 24 సంవత్సరాల అనుభవంతో ప్రేక్షకులతో మంచి నమ్మకం ఏర్పడిందని మోనా తెలిపారు. తాను ఎంచుకునే కథలు సమాజంలో చర్చలకు దారితీయాలని ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. మొత్తానికి, Maa Ka Sum కూడా అలాంటి ప్రత్యేకమైన కథతో ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని మోనా సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Lipika Varma

Lipika Varma

Next Story