Monal Gajjar: కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న మోనాల్ గజ్జర్.. క్యాన్సర్ పోరాటం నేర్పిన జీవిత పాఠం
జీవిత పాఠం

Monal Gajjar: జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరూ ఊహించలేరు. ఒకరోజు ఆనందంగా సాగిపోతున్న జీవితం మరుసటి రోజే అనుకోని కఠిన పరీక్షను ఎదుర్కోవచ్చు. అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు నటి మోనాల్ గజ్జర్. పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా కారణంగా నవంబర్ 2న ఆమెకు సర్జరీ జరిగింది. అయితే ఆ కష్టమైన దశను ధైర్యంగా అధిగమించి ఇప్పుడు సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చారు.నవంబర్ 1న సర్జరీకి సిద్ధమవుతున్న సమయంలో తీసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరుసటి రోజు జరిగిన శస్త్రచికిత్స ఏడున్నర గంటల పాటు సాగింది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన క్షణాల నుంచి ఆసుపత్రిలో గడిపిన రోజులు, కుట్లు, కోలుకునే ప్రయాణం వరకు ప్రతి అనుభవం తనకు ధైర్యాన్ని నేర్పించిందని మోనాల్ పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మ, సోదరి ఇచ్చిన ఆత్మీయ స్వాగతం తనకు ప్రత్యేకంగా అనిపించిందని గుర్తుచేసుకున్నారు.
“నేను భ్రమల్లో ఉన్నానని అనుకున్నా పర్వాలేదు.. నాకు కావాల్సిన ప్రతిదీ ఏదో ఒకరోజు తప్పకుండా దక్కుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను” అంటూ ఒక సంస్కృత శ్లోకాన్ని కూడా పంచుకున్నారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు చూపించిన ప్రేమ, ఆప్యాయత తనకు ఎంతో ధైర్యాన్నిచ్చాయని చెప్పారు. స్నేహితులు పంపిన పూల బొకేలు, ఆత్మీయ సందేశాలు, పరామర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా తన గురుమా ఆశీస్సులు, కృప తనకు ఎంతో అండగా నిలిచాయని పేర్కొన్నారు. క్రమంగా కోలుకుంటూ కుట్లు తొలగించుకోవడం, వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం ద్వారా ఒక్కో అడుగు ముందుకు వేశానని చెప్పారు. నెమ్మదిగా సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చానని, ఇప్పుడు స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొంటూ, కొత్త వ్యక్తులను కలుస్తూ, ప్రయాణాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నానని తెలిపారు.
“నువ్వు ఎలా ఉన్నావు?” అని చాలామంది అడుగుతున్నారు. వారందరికీ నా సమాధానం ఒక్కటే.. నేను చాలా బాగున్నాను. ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అని ఆమె అన్నారు. ఈ నవంబర్ నెల తనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పించిందని మోనాల్ చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని అర్థమైందని పేర్కొన్నారు.
మన ప్రణాళికలు, గడువులు, విజయాలు, భౌతిక సంపదలు ఏవీ ఆరోగ్యం కంటే గొప్పవి కావని, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని, జీవితంలో ఒక్క రోజును, ఒక్క శ్వాసను, మనల్ని ప్రేమించే మనుషులను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవద్దని కోరారు. నవంబర్ నన్ను పరీక్షించింది, ఎన్నో పాఠాలు నేర్పించింది, మరింత ధైర్యంగా మార్చింది. అన్నింటికంటే ముఖ్యంగా జీవితం ఎంత అందమైనదో మరోసారి గుర్తు చేసిందని ఆమె అన్నారు.
నేను కోలుకున్నందుకు మాత్రమే సంతోషంగా లేను.. ఈ అందమైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నానని మోనాల్ తెలిపారు. తొలి దశలోనే గుర్తించడం వల్ల సర్జరీ విజయవంతమైందని, ఈ రకం క్యాన్సర్ నెమ్మదిగా వ్యాపిస్తుందని వైద్యులు చెప్పారని ఆమె గుర్తు చేశారు. పాజిటివ్ మైండ్‌సెట్‌తో త్వరగా కోలుకున్నానని, కుటుంబం, స్నేహితుల మద్దతు ఎంతో ముఖ్యమని చెప్పారు. ఇప్పుడు నెలకోసారి వైద్యులను కలవాలని సూచించారు. త్వరలో సినిమా షూటింగ్‌లు ప్రారంభించనున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, సమయానికి చెకప్‌లు చేయించుకోవాలని అందరికీ సందేశం ఇచ్చారు. మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా సూచించారు. మోనాల్ గజ్జర్ ధైర్యం, పాజిటివ్ ఆలోచన అభిమానులకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.

