Rajamouli’s Big Dream: హాలీవుడ్ ఆఫర్ల కంటే అదే ముఖ్యం.. భారతీయ సినిమాపై రాజమౌళి బిగ్ డ్రీమ్..
భారతీయ సినిమాపై రాజమౌళి బిగ్ డ్రీమ్..

Rajamouli’s Big Dream: ప్రస్తుతం భారతీయ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందంటే అది కేవలం ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ప్రభంజనమే. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో ఆస్కార్ గడ్డపై తెలుగు జెండా ఎగురవేసిన ఆయన.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భారతీయ సినిమా భవిష్యత్తుపై తన మనసులోని మాటను పంచుకున్నారు. హాలీవుడ్ నుండి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ, వాటిని సున్నితంగా తిరస్కరించిన జక్కన్న.. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చాటిచెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా మేనియా రావాలి..
"ప్రపంచవ్యాప్తంగా కొరియన్ మ్యూజిక్ కు ఎలాంటి డిమాండ్ ఉందో, జపనీస్ యానిమేషన్‌కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో.. భారతీయ సినిమాకు కూడా ప్రపంచవ్యాప్తంగా అలాంటి గుర్తింపు రావాలన్నదే నా కోరిక" అని రాజమౌళి అన్నారు. ఇటీవల ఇండియాలో విడుదలైన డెమన్ స్లేయర్ అనే జపనీస్ యానిమేటెడ్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంపై ఆయన స్పందిస్తూ.. మన సినిమాల్లోని బలమైన భావోద్వేగాలు, సంగీతం ప్రపంచ ప్రేక్షకులను కచ్చితంగా కట్టిపడేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిరూపితమైన నమ్మకం
మన కథల్లోని నిజాయితీ ప్రపంచం నలుమూలల ప్రజలకు చేరుతుందనే తన నమ్మకం RRR విజయంతో నిజమైందని ఆయన పేర్కొన్నారు.
మహేష్ బాబుతో వారణాసి.. హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్..
రాజమౌళి తన తదుపరి చిత్రంతో ఈ కలను సాకారం చేసే పనిలో పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా వారణాసి అనే చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. ఈ సినిమాను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అడ్వెంచర్ చిత్రం ఏప్రిల్ 07, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

