MS Subbulakshmi Biopic: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం.. రష్మిక తొలి షాట్‌కు కమల్ హాసన్ క్లాప్
కమల్ హాసన్ క్లాప్

MS Subbulakshmi Biopic: ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ అధికారికంగా ప్రారంభమైంది. నిర్మాతలు అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రను నటి రష్మిక మందన్న పోషిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా బుధవారం చెన్నైలోని ప్రముఖ మ్యూజిక్ అకాడమీలో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లెజెండరీ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రష్మిక మందన్నపై చిత్రీకరించిన తొలి షాట్‌కు కమల్ హాసన్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని పంచుకున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి లాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నటిగా ఇలాంటి గొప్ప పాత్ర దక్కడం పట్ల ఎంతో గర్వంగా, గౌరవంగా ఉందన్నారు. ఎంఎస్ అమ్మ జీవిత ప్రయాణంలో తాను కూడా ఒక చిన్న భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సినిమా మొత్తం ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆశీస్సులు తమకు ఉంటాయని నమ్ముతున్నామని రష్మిక చెప్పారు. ఈ పాత్ర కోసం పూర్తిగా కష్టపడతానని, అందరూ మెచ్చేలా ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మను తెరపై చూపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఎంఎస్ సుబ్బులక్ష్మి తన గొంతుతో దేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఒక్కటిగా కలిపిన సంగీత సామ్రాజ్ఞి అని కొనియాడారు. ఆమె సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడతో పాటు పలు భాషల్లో పాటలు పాడారని గుర్తుచేశారు. ఆమె ఏ భాషలో పాడినా, ఆ భాష అందాన్ని తన సంగీతంతో మరింత పెంచేవారని చెప్పారు.
ఎంఎస్ సుబ్బులక్ష్మి తన జీవితంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అని కమల్ హాసన్ తెలిపారు. ఆమె పాడిన సుప్రభాతం, లలితా సహస్రనామం, రంగపుర విహార పాటలు విన్నప్పుడల్లా తన మనసుకు ప్రశాంతత, ఆనందం కలుగుతాయని చెప్పారు. మహాత్మా గాంధీ కూడా ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీతానికి ఎంతో అభిమానిగా ఉండేవారని పేర్కొన్నారు.
రష్మికను చూస్తుంటే తనకు అసూయగా ఏమీ అనిపించడం లేదని కమల్ హాసన్ సరదాగా అన్నారు. తాను గడ్డం తీసేసుకున్నా కూడా ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ పాత్రను రష్మికలా చేయలేనని నవ్వుతూ చెప్పారు. ఆమెకు దక్కిన ఈ పాత్రను తాను పోషించినా, ఎంఎస్ అమ్మకు తగిన విధంగా చూపించలేనని అన్నారు.
గొప్ప గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్న ఈ బయోపిక్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తుండటం, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం, అనిరుధ్ సంగీతం అందించడం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

