మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్

Padma Shri: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అత్యున్నత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక కనులపండువగా సాగింది. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్.. వివిధ రంగాల దిగ్గజాల రాకతో కళకళలాడింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ఏడాది ప్రముఖులు పద్మ అవార్డులను అందుకున్నారు. రెండు విడతలుగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలో.. దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో పాటు వెండితెర సృజనకారులు తమ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
తెలుగు చలనచిత్ర రంగానికి ఈ వేడుక ఎంతో గర్వకారణంగా నిలిచింది. తెలుగు సినిమా నవ్వుల రేడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు.. సీనియర్ నటుడు, నిర్మాత మాగంటి మురళీ మోహన్ కళారంగానికి చేసిన అమూల్యమైన సేవలకు గానూ పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఇద్దరు దిగ్గజాలు అవార్డు తీసుకుంటున్న క్షణం తెలుగు ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరించింది.
మరోవైపు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి. నారాయణన్ దేశ అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే.. ప్రముఖ గాయని అల్కాయాగ్నిక్ తో పాటు, ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఐదు దశాబ్దాలుగా, 400లకు పైగా చిత్రాల్లో వైవిధ్యభరిత నటనతో దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మలయాళ లెజెండ్ మమ్ముట్టిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
మెగాస్టార్ మమ్ముట్టి ఈ అత్యున్నత అవార్డును అందుకుంటున్న సమయంలో.. సదస్సులో కూర్చున్న ఆయన కుమారుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి. గర్వంతో తండ్రిని చూస్తూ దుల్కర్ చప్పట్లతో మురిసిపోయిన హార్ట్-టచింగ్ విజువల్స్.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తండ్రీకొడుకుల బంధానికి, ఒక నటుడిగా తండ్రి సాధించిన విజయానికి కొడుకు ఇచ్చిన ఈ గౌరవానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

