Sai Tej: సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతకర కామెంట్లపై ప్రముఖ సినీ నటుడు సాయి దుర్గ తేజ్ తీవ్రంగా స్పందించారు. పిల్లలు ఉపయోగించే సామాజిక మాధ్యమాల అకౌంట్లకు తప్పనిసరిగా ఆధార్ నంబర్ లేదా తల్లిదండ్రుల ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఇలా చేయడం వల్ల ఆన్‌లైన్‌లో ఇతరులను దూషించాలంటే భయం, బాధ్యత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా వల్ల వ్యక్తిగత ఇబ్బందులు

‘అభయం మాన్‌సూన్-25 సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్, తాను సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకున్నారు. "నా ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను, నా కుటుంబాన్ని దారుణంగా తిడుతూ కామెంట్లు పెడుతుంటారు. నేను పెద్దవాడిని కాబట్టి వాటిని తట్టుకోగలను. కానీ ఇదే పరిస్థితి చిన్నపిల్లలకు ఎదురైతే ఎలా అర్థం చేసుకుంటారు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్య తీవ్రతను తెలియజేసేందుకు, తనపై వచ్చిన కొన్ని బూతు కామెంట్లను వేదికపైనే ఇతరుల చేత చదివించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మీడియా రచ్చ వల్లే నా ప్రేమ బ్రేకప్ అయింది

ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా సాయి దుర్గ తేజ్ సంచలన విషయాలను బయటపెట్టారు. మీడియాలో తన పెళ్లి గురించి వచ్చిన ప్రచారాల వల్లే తన ప్రేమ విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "నా పెళ్లి ఫలానా అమ్మాయితో, ఫలానా వారితో అంటూ మీడియా చేసిన రచ్చ చూసి నా కాలేజీ గర్ల్‌ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్లిపోయింది. అది చాలా బాధాకరమైన బ్రేకప్" అని అన్నారు. పెళ్లి విషయంలో మీడియా కొంచెం ప్రశాంతంగా ఉంటే, సరైన సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా శుభవార్తను ప్రకటిస్తానని తేజ్ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story