Nag Ashwin: భారతీయ ఇతిహాసాలు, పురాణాల్లో సైన్స్‌ ఫిక్షన్‌ శైలి కథలకు సరిపడే అద్భుతమైన భావనలు దాగి ఉన్నాయని ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పష్టం చేశారు. పురాణాల్లోని అపారమైన కథా ప్రపంచాన్ని తెరపైకి ఆవిష్కరించడంలో కల్కి 2898 ఏడీ తొలి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఈ తరహా ప్రయోగాలు భారతీయ సినీ పరిశ్రమ నుంచి మరింత విస్తృతంగా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాలం, అమరత్వం, పునర్జన్మ, యుగాంతం, అత్యాధునిక ప్రపంచాల వంటి ఎన్నో వినూత్న అంశాలు మన పురాణాల్లో అనాదిగానే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ అంశాలను సైన్స్ ఫిక్షన్ కథలుగా మలచడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, పురాణాల ఆధారంగా వెండితెరపై సైన్స్ ఫిక్షన్ కథలను నిర్మించవచ్చని ‘కల్కి 2898 ఏడీ’ నిరూపించిందని తెలిపారు. ఈ విజయం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొత్త నమ్మకాన్ని ఇచ్చిందని, నిర్మాతలు, అగ్ర నటులు సైతం భారీ బడ్జెట్లతో ఇలాంటి ప్రయోగాత్మక ప్రాజెక్టులకు ముందుకు వచ్చేందుకు ఇది మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు.

2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన కల్కి 2898 ఏడీ ప్రతిష్ఠాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు కీలక అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంతో పాటు బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలోనూ ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన, దిశా పటానీ వంటి అగ్ర తారాగణంతో భవిష్యత్ కాశీ నేపథ్యంలో 2898వ సంవత్సరం పరిణామాల చుట్టూ ఈ కథను మలిచారు. ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’కు ప్రారంభ ఘట్టంగా నిలిచిన ఈ చిత్రం ఇచ్చిన ఊపుతో, రాబోయే రోజుల్లో భారతీయ పురాణాల నుంచి మరిన్ని విజువల్ వండర్స్ తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story