క్లారిటీ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్!

‘Dragon’ Movie: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న "డ్రాగన్" (NTRNeel) సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. హీరో లుక్ విషయంలో ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వైరల్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.

సినిమా ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, షూటింగ్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని మేకర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న బ్రేక్ కేవలం తదుపరి షెడ్యూల్ కోసం చేసుకుంటున్న సాధారణ సన్నాహక విరామం మాత్రమేనని వారు వెల్లడించారు. లుక్ గురించి కానీ, షెడ్యూల్ రద్దు గురించి కానీ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని వారు కొట్టిపారేశారు. "షూటింగ్ పక్కా ప్లానింగ్‌తో సాగుతోంది. ఎవరూ ఇలాంటి అనధికారిక వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. అధికారిక సమాచారం మా నుండే వస్తుంది" అని టీమ్ స్పష్టం చేసింది.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు లేదా సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ ఇంకా బయటపెట్టలేదు. అధికారిక అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు పుకార్లకు చెక్ పెడుతూ ప్రశాంతంగా ఉండమని నిర్మాణ సంస్థ కోరింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story