Nag Ashwin: సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గింపు.. ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక విజ్ఞప్తి
ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక విజ్ఞప్తి

Nag Ashwin: సినిమా టికెట్లపై జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ సంస్కరణలు సరైన దిశలో ఒక అడుగుగా ఆయన పేర్కొన్నప్పటికీ, మరింత మెరుగైన పరిష్కారాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు.
రూ.250 టికెట్లపై 5శాతం జీఎస్టీ కావాలి
తాజా జీఎస్టీ మార్పుల ప్రకారం, రూ.100 లోపు సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అయితే ఈ నిర్ణయం తక్కువ థియేటర్లకే వర్తిస్తుందని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా ఆయన ప్రధాని మోదీని ఉద్దేశించి.. "రూ.100 లోపు టికెట్లతో పనిచేస్తున్న థియేటర్లు చాలా తక్కువ. ప్రజలకు నిజమైన లాభం చేకూరాలంటే, రూ.250 లోపు టికెట్లకూ 5 శాతం జీఎస్టీ వర్తింపజేయాలి" అని విజ్ఞప్తి చేశారు. ఈ మార్పు వల్ల మధ్య తరగతి ప్రేక్షకులకు ఆర్ధికంగా ఊరట లభిస్తుందని, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరగడంతో పాటు, సినీ పరిశ్రమ అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో, ఈ మార్పులు వారికి మరింత ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు.
