షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అంటే.?

Kalki 2: ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించడమే కాకుండా, రెండో భాగంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2’ షూటింగ్‌పై తాజా అప్‌డేట్‌ ఇచ్చారు. ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘కల్కి 2 షూటింగ్ చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో నటీనటులందరి కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయి. అందుకే అందరూ అందుబాటులోకి వచ్చినప్పుడే షూటింగ్ చేయాలి. యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉంటాయి. వాటిని చిత్రీకరించడానికి ఎక్కువ సమయం పడుతుంది’’ అని తెలిపారు.

అంతేకాకుండా ప్రస్తుతం కల్కిలో నటించిన స్టార్స్ అందరూ బిజీగా ఉన్నారని నాగ్ అశ్విన్ తెలిపారు. ‘‘ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించాలని మేము అనుకుంటున్నాం. షూటింగ్‌కు తక్కువ సమయం పట్టినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుంది. మరో రెండు సంవత్సరాల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను’’ అని స్పష్టం చేశారు.

గతంలో నిర్మాత అశ్వనీ దత్ మాట్లాడుతూ.. ‘‘రెండో భాగం మొత్తం కమల్‌ హాసనే ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య కీలక సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది’’ అని వెల్లడించడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నెలలో ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ‘ఫౌజీ’ షూటింగ్‌లో పాల్గొంటారు. దీంతో పాటు సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా కూడా లైన్‌లో ఉంది. అక్టోబర్‌లో దాని షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలు పూర్తయ్యాక ప్రభాస్ ‘కల్కి 2’లో జాయిన్ అవుతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story