‘Dhootha 2’: నిర్మాతగా మారిన నాగచైతన్య.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన దూత 2
అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన దూత 2

‘Dhootha 2’: అక్కినేని యువ హీరో నాగచైతన్య నటుడిగా వైవిధ్యాన్ని చాటుకుంటూనే, ఇప్పుడు నిర్మాతగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, సంచలన విజయం సాధించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూతకు సీక్వెల్‌గా దూత 2 రాబోతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ రెండో భాగం నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున
ఈ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ నాగార్జున, ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తండ్రి చేతుల మీదుగా ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కావడం విశేషం.
అద్భుతాలు జరగబోతున్నాయి - సోషల్ మీడియాలో చైతూ పోస్ట్
ఈ సిరీస్‌తో తాను నిర్మాతగా ప్రమోషన్ పొందినట్లు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. పూజా కార్యక్రమాల ఫొటోలను పంచుకుంటూ.. "దూత రెండో అధ్యాయంలోకి అడుగుపెట్టడంతో పాటు, నిర్మాతగా నా తొలి అడుగు వేస్తున్నాను. ఈ శుభారంభం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఇక ముందుకు సాగడమే.. అద్భుతాలు జరగబోతున్నాయి" అంటూ చైతూ భావోద్వేగంగా రాసుకొచ్చారు.
అదే క్రేజీ కాంబినేషన్.. మళ్లీ సెట్స్‌పైకి..
మొదటి భాగంలో నటించిన వారే ఈ రెండో భాగంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా ఈవెంట్ ఫొటోలను షేర్ చేస్తూ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హర్షం వ్యక్తం చేశారు. "మళ్లీ అదే క్రేజీ టీమ్‌తో కలవడం ఆనందంగా ఉంది. మాలో మరింత ఉత్సాహం నింపిన నాగార్జున గారికి ధన్యవాదాలు" అని ఆమె పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో నాగచైతన్యతో పాటు పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
దూత 1 సక్సెస్ ట్రాక్.. పార్ట్ 2 పై భారీ అంచనాలు
మొదటి భాగంలో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందే హెచ్చరించే న్యూస్‌పేపర్ రహస్యాన్ని ఛేదించే జర్నలిస్ట్ సాగర్ పాత్రలో చైతన్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక హత్య కేసులో ఇరుక్కున్న సాగర్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే క్రమంలో సాగే సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. శరత్ మరార్ నిర్మించిన తొలి భాగానికి సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ రెండో భాగాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా నాగచైతన్య స్వయంగా సహనిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మిస్తుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

