Nandamuri Balakrishna and Koratala Siva: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆయన తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాలయ్య తదుపరి చిత్రం కోసం వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి ప్రతిభావంతులైన యువ దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే కొరటాల శివ వినిపించిన కథలోని పవర్‌ఫుల్ పాయింట్ బాలయ్యను అమితంగా ఆకట్టుకోవడంతో ఆయనకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సందేశం + మాస్ యాక్షన్

కొరటాల శివ తన చిత్రాల్లో బలమైన సామాజిక సందేశాన్ని కమర్షియల్ హంగులతో జోడించడంలో దిట్ట. మిర్చి నుంచి మొన్నటి దేవర వరకు ఆయన మేకింగ్‌లో ఒక ప్రత్యేక శైలి కనిపిస్తుంది. బాలయ్య మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కొరటాల ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. 60 ఏళ్లు దాటినా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. దేవర చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించి మళ్లీ తన ఫామ్‌ను నిరూపించుకున్నారు.

అభిమానుల్లో భారీ అంచనాలు

మాస్ పల్స్ తెలిసిన బాలకృష్ణ ఇమేజ్‌కి, హీరోను ఎంతో హుందాగా, శక్తివంతంగా చూపే కొరటాల మార్క్ తోడైతే థియేటర్లలో రికార్డుల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Next Story