Nandamuri Balakrishna: ఢిల్లీ వేదికగా బాలయ్యకు అరుదైన గౌరవం
బాలయ్యకు అరుదైన గౌరవం

Nandamuri Balakrishna: నందమూరి తారక రామారావు వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. తనదైన శైలిలో ఐదు దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగుతున్న నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మరో కలికితురాయి చేరింది. ఢిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFD) 2026లో బాలయ్యను ప్రతిష్టాత్మక 'జీవిత సాఫల్య పురస్కారం' (Lifetime Achievement Award) వరించింది.
సినీ రంగంలో బాలకృష్ణ చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఐదు దశాబ్దాలుగా విభిన్న పాత్రలతో మెప్పిస్తూ, తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి చేర్చినందుకు గాను ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ వేడుకలో బాలయ్య తనదైన హుందాతనంతో అవార్డును స్వీకరించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ చలనచిత్రోత్సవంలో మరో విశేషం ఏమిటంటే.. ఇటీవల ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్న బాలకృష్ణ చిత్రం ‘భగవంత్ కేసరి’ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. మహిళా సాధికారత, బాధ్యత గల తండ్రి పాత్రలో బాలయ్య నటనకు అక్కడ ఉన్న అంతర్జాతీయ సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. ఒక వైపు అవార్డు.. మరోవైపు సినిమా ప్రదర్శనతో ఢిల్లీలో నందమూరి నామస్మరణ మారుమోగింది.
ఈ గర్వకారణమైన క్షణాల్లో బాలయ్యతో పాటు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి,నిర్మాత సాహు గారపాటి కూడా పాల్గొన్నారు. తెలుగు సినిమా సత్తాను చాటిచెబుతూ, తమ కథానాయకుడికి దక్కిన ఈ గౌరవాన్ని చూసి వారు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ అవార్డు బాలయ్య అభిమానులకు ఒక పెద్ద పండుగను మిగిల్చింది.

