నంది అవార్డులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Nandi Awards: చాలా కాలంగా నిలిచిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డుల ప్రధానోత్సవానికి ఎట్టకేలకూ ముహూర్తం ఖరారైంది. ఈ అవార్డుల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. శనివారం రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు.

రెండు మూడు నెలల్లో వేడుక:

వచ్చే రెండు లేదా మూడు నెలల్లోనే నంది అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవార్డుల ఎంపిక ప్రక్రియ, నిబంధనలలో మార్పులు చేర్పులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణల నుండి సలహాలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. 2017 తర్వాత మళ్లీ అవార్డులు ఇవ్వలేదు. కాబట్టి పాత నిబంధనలనే అనుసరించాలా? లేక కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాలా? అనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

అన్ని రంగాలకు గుర్తింపు:

కేవలం సినిమా రంగమే కాకుండా టీవీ, నాటక రంగ కళాకారులకు కూడా నంది అవార్డులు ప్రదానం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే నంది నాటకోత్సవాలను కూడా నిర్వహిస్తామని ప్రకటించారు.

గతంలో 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించి 2017లో అవార్డులను అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత గత ప్రభుత్వం వీటిని నిర్వహించకపోవడంతో అవార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కళాకారులకు గౌరవం దక్కనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story