Nani and Venky Atluri: నాని, వెంకీ అట్లూరి కాంబినేషన్లో కొత్త సినిమా!
కొత్త సినిమా!

Nani and Venky Atluri: నేచురల్ స్టార్ నాని గత కొంతకాలంగా మాస్ యాక్షన్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, గతంలో ఆయన నటించిన కంటెంట్ ఉన్న సినిమాలు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న కథలు నానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాంటి సినిమాలకు దూరంగా ఉంటూ మాస్ యాక్షన్ కథలను ఎంచుకుంటున్నారంటూ ఇటీవల ఆయనపై కొంత విమర్శలు కూడా వస్తున్నాయి.
గత కొన్నేళ్లలో నాని నటించిన ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలు మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ కూడా ఇదే తరహాలో రూపొందుతోంది. ఇక సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’ కూడా మాస్ యాక్షన్ కథతోనే రూపొందుతున్నట్లు సమాచారం.
అయితే, ఇకపై ఇలాంటి కథలకు భిన్నంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు నాని ఇటీవల మీడియాతో చెప్పారు. ‘బ్లడీ రోమియో’ తర్వాత అలాంటి ఓ సినిమాను చేయడానికి ఇప్పటికే కథను ఎంపిక చేసుకున్నట్లు కూడా ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో నాని తర్వాతి సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరితో నాని ఓ సినిమా చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ముఖ్యంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా నానికి బాగా నచ్చిందని, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఓ మంచి కథను సిద్ధం చేయాలని ఆయన వెంకీ అట్లూరిని కోరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమైతే, నాని మరోసారి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ నిర్మించనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

