‘The Paradise’: ది ప్యారడైజ్ ప్రీమియర్ షో.. రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి.. స్పందించిన సిఎం
స్పందించిన సిఎం

‘The Paradise’: నేచురల్ స్టార్ నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ది ప్యారడైజ్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ చిత్ర విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ కేంద్రమైన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్‌లో అభిమానులు, సాధారణ ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు అనుమతివ్వాలని కోరుతూ నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారిక ప్రోటోకాల్స్, భద్రతా నిబంధనలను నూటికి నూరు శాతం పాటిస్తామని, సామాన్య ప్రజల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని ఆయన తన విజ్ఞప్తిలో హామీ ఇచ్చారు.
హీరో నాని చేసిన అభ్యర్థనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సానుకూలంగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలకు ప్రాధాన్యతనిస్తూ విన్నవించినందుకు నానిని అభినందించిన సీఎం, తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడారు. అయితే సినిమా ఈవెంట్ల సమయంలో భారీగా తరలివచ్చే జనసమూహ నియంత్రణ, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రీమియర్ షో అనుమతుల కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని చిత్ర బృందానికి సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, భద్రతా పరిస్థితులు, శాంతిభద్రతలను పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అనుమతులపై తుది నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ వ్యవహారం ఇప్పుడు పోలీసుల పరిశీలనలోకి వెళ్లింది.

