Nani’s The Paradise: దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు నిదర్శనంగా నైజాం ప్రాంతంలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

టికెట్ల కోసం ఎగబడ్డ ప్రేక్షకులు.. రికార్డు స్థాయి వసూళ్లు

నిన్న రాత్రి డిస్ట్రిక్ట్ యాప్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే టికెట్ల కోసం ప్రేక్షకులు పోటెత్తారు. బుకింగ్స్ మొదలైన స్వల్ప వ్యవధిలోనే నైజాం పరిధిలో ఏకంగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలైంది. ఒక్క రాత్రిలోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడై పలు థియేటర్లలో షోలన్నీ క్షణాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. మిగతా ప్రాంతాల్లోనూ పూర్తిస్థాయి బుకింగ్స్ ప్రారంభం కానుండటంతో ఓపెనింగ్స్ పరంగా ది ప్యారడైజ్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

భారీ కాస్టింగ్.. వైవిధ్యమైన పాత్రలో నాని

దసరాలో ఊరమాస్ అవతారంలో మెప్పించిన నాని, ఈ చిత్రంలో మరింత వైవిధ్యమైన సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ కథను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఉన్న హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణిలు ఇతర కీలక పాత్రలు పోషించగా, సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి.

నేడు శిల్పకళా వేదికలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను మేకర్స్ మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ది ప్యారడైజ్ ప్రీ-రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేదికపై అభిమానుల కోసం ఓ అద్భుతమైన ప్రత్యేక సర్‌ప్రైజ్ ఉండబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story