Nara Rohit: టాలీవుడ్ ప్రముఖ నటుడు నారా రోహిత్ తన కుమారుడి పేరును అధికారికంగా అభిమానులతో పంచుకున్నారు. తమ ముద్దుల తనయుడికి నందన్ రామ నారా అని నామకరణం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నెలలో నారా రోహిత్ - శిరీష దంపతులకు మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే.

పేరు వెనుక ఉన్న ప్రత్యేక అర్థం

కొడుకు నామకరణం సందర్భంగా రోహిత్ పెట్టిన భావోద్వేగ పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ పేరులోని అంతరార్థాన్ని ఆయన స్వయంగా వివరించారు:

నందన్: అనంతమైన ఆనందాన్ని, సంతోషాన్ని అందించేవాడని అర్థం.

రామ: తమ కుటుంబ మూలపురుషుడు, తాతగారి పట్ల ఉన్న గౌరవంతో పాటు ఆయన జ్ఞాపకార్థం పేరులో రామను చేర్చినట్లు స్పష్టం చేశారు.

ఈ ప్రపంచంలోకి స్వాగతం చిట్టి నందన్

"మా కుటుంబ ప్రేమకు, తరతరాల మధుర జ్ఞాపకాలకు ఈ పేరు ఒక ప్రతీక. మా చిట్టి నందన్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. వెల్‌కమ్ టు ది వరల్డ్ లిటిల్ నందన్" అంటూ రోహిత్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. నారా రోహిత్ పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రోహిత్-శిరీష దంపతులకు సినీ ప్రముఖులు, నారా అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story