Nara Rohith: రోహిత్ నారా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రానికి 'కపాలి' అనే టైటిల్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు రామ్ గన్ని రూపొందిస్తున్న ఈ సినిమా పోలీసు దర్యాప్తు నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోయిన్‌గా హన్సిక మోత్వానీ నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప నిర్మిస్తున్నారు. విజయ్ కృష్ణ లింగమనేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

రోహిత్ నారా పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. 'కపాలి' అంటే "పుర్రెను ధరించినవాడు" అనే అర్థం. ఈ టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్‌ను కూడా ఎంతో భయానకమైన, మిస్టరీ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. సినిమా థీమ్‌కు అనుగుణంగా పోస్టర్‌లోని ప్రతి అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోహిత్ నారా దట్టమైన గడ్డంతో, రఫ్ లుక్‌లో, తీవ్రమైన హావభావాలతో కనిపిస్తున్నారు. ఆయన తలపై చెట్ల కొమ్మలు కిరీటంలా విస్తరించి ఉండగా, నేపథ్యంలో కనిపిస్తున్న ప్రాచీన రహస్య సంకేతాలు క్షుద్ర శక్తులు, పురాణ అంశాలను సూచిస్తున్నాయి. అలాగే "A Journey Into The Unknown" అనే ట్యాగ్‌లైన్ సినిమా మరింత మిస్టరీతో కూడిన ప్రయాణంగా ఉండబోతోందనే ఆసక్తిని పెంచుతోంది. ఈ విభిన్నమైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ క్యూరియాసిటీని కలిగించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story