గ్రాండ్‌గా లాంచ్

Narne Nithiin: 'మ్యాడ్’ (MAD), ‘ఆయ్’ (Aye) వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నార్నే నితిన్ తన ఐదో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం (#NN5) ఈరోజు హైదరాబాద్‌లో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.5గా వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో నార్నే నితిన్ సరసన అనిఖా సురేంద్రన్, మేఘా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో ‘మ్యాడ్’ చిత్ర దర్శకుడు కల్యాణ్ శంకర్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, నిర్మాత వెంకట్ కె. నారాయణ స్క్రిప్ట్‌ను దర్శకుడు రాధాకృష్ణ రెడ్డికి అందజేసి బెస్ట్ విషెస్ తెలిపారు.
ఇటీవలే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంగీత ద్వయం వివేక్-మెర్విన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. క్లీన్ లవ్, కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఒక చక్కని యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

