Natasimham Balakrishna: నటసింహం బాలకృష్ణ కొత్త ప్లాన్: ఎక్కువ సినిమాలు.. భారీ సంపాదన!
ఎక్కువ సినిమాలు.. భారీ సంపాదన!

Natasimham Balakrishna: నందమూరి బాలకృష్ణ తన పారితోషికాన్ని భారీగా పెంచాలనే ఆలోచనను మార్చుకుని, ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. గతంలో ‘అఖండ 2’ సినిమాకు ఉన్న పాన్-ఇండియా క్రేజ్, అలాగే ఆ చిత్రం రూ. 200 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందనే నమ్మకంతో ఆయన తన రెమ్యూనరేషన్‌ను గట్టిగానే పెంచారు. కానీ, అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పాటు, నిర్మాతలకు ముందే ఉన్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మరింత భారం పడింది. దీంతో బాలకృష్ణ పెద్ద మనసు చేసుకుని, తన పారితోషికాన్ని రూ. 45 కోట్ల నుండి రూ. 35 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు కూడా ఆయన రెమ్యూనరేషన్ రూ. 35 కోట్ల రేంజ్‌లోనే ఉండబోతోందని సమాచారం. అయితే, ఆయా సినిమాల బిజినెస్ పర్ఫార్మెన్స్‌ను బట్టి ఆయనకు అందే తుది మొత్తం ఆధారపడి ఉంటుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ ఒక సరికొత్త స్కెచ్ వేశారు. భారీ పారితోషికం కోసం ఎదురుచూడకుండా.. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు పూర్తి చేసి, మొత్తంగా భారీగా సంపాదించాలనేదే ఆయన కొత్త ప్లాన్. రాబోయే 20 నెలల్లో ఎలాగైనా నాలుగు సినిమాలు పూర్తి చేయాలని, వాటి ద్వారా కనీసం రూ. 150 కోట్లు ఆర్జించాలని ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ఇందుకోసం ఆయన రూట్ మార్చి, సాధారణంగా మాస్ సినిమాలు తీయని ఇద్దరు యువ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైవిధ్యమైన చిత్రాలు తీసే వివేక్ ఆత్రేయ, అలాగే విజయ్ కనకమేడల దర్శకత్వంలో నటించేందుకు బాలయ్య ఒప్పుకున్నారు. వీటికి సంబంధించిన చర్చలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి, త్వరలోనే ఈ సినిమాలపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలే బాలకృష్ణ లైనప్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ 2028 లోపే పూర్తి చేయాలనే పట్టుదలతో బాలయ్య ఉన్నారు.

