National Award Winner: సుకుమార్ కూతురికి నేషనల్ అవార్డు.. సన్మానించిన సీఎం రేవంత్
సన్మానించిన సీఎం రేవంత్

National Award Winner: టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కుటుంబంతో పాటు నిర్మాత యలమంచిలి రవిశంకర్ తెలంగాణ సీఎం రేవంత్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. “గాంధీ తాత చెట్టు” సినిమాకు ఉత్తమ బాల నటిగా సుకుమార్ కుమార్తె సుకృతి జాతీయ అవార్డు పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సుకృతిని సన్మానించి అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ఈ సినిమా ఒక పల్లెటూరిలో నివసించే గాంధేయవాది రామచంద్రయ్య (ఆనంద్ చక్రపాణి, అతని మనవరాలు గాంధీ (సుకుమార్ కూతురు సుకృతి వేణి) కథ. రామచంద్రయ్యకు తన పూర్వీకుల నుంచి వచ్చిన 15 ఎకరాల పొలంతో పాటు, అందులోని పెద్ద వేపచెట్టు అంటే చాలా ఇష్టం. గాంధీ కూడా తన తాత నుంచి గాంధేయ సిద్ధాంతాలను, సత్యం, అహింస, ధర్మం వంటి విలువలను నేర్చుకుంటుంది.
ఊరిలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చిన వ్యాపారవేత్తలు, రైతులందరినీ డబ్బు ఆశ చూపించి వారి భూములను కొనేస్తారు. కానీ రామచంద్రయ్య తన వేపచెట్టును రక్షించుకోవడానికి భూమి అమ్మడానికి నిరాకరిస్తాడు. ఆ తరువాత జరిగే సంఘటనలు, ఆ చిన్నారి గాంధీ తన తాత కోసం, ఊరి కోసం, చెట్టు కోసం ఎలా పోరాడింది అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం.
ఈ సినిమా జనవరి 24, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇది మార్చి 21, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమా విడుదలకు ముందే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో తన నటనకు గాను సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు లభించింది.
