Naveen Polishetty Roars at the Box Office: బాక్సాఫీస్ వద్ద నవీన్ పోలిశెట్టి గర్జన: 5 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో అనగనగా ఒక రాజు..
రూ. 100 కోట్ల క్లబ్‌లో అనగనగా ఒక రాజు..

Naveen Polishetty Roars at the Box Office: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. స్టార్ ఇమేజ్ కంటే కథా బలన్నే నమ్ముకునే నవీన్, ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ స్టామినాని నిరూపించుకున్నారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
వసూళ్ల ప్రభంజనం
మొదటి రోజే ఈ చిత్రం రూ. 22 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించి సంచలనం సృష్టించింది. మూడు రోజుల్లో రూ. 61.1 కోట్లు రాబట్టిన ఈ సినిమా, ఐదు రోజులు గడిచేసరికి రూ. 100.2 కోట్లకు చేరుకుందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
హ్యాట్రిక్ సక్సెస్:
జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ ఖాతాలో ఇది వరుసగా మూడో ఘనవిజయం.
అమెరికాలో రాజు హ్యాట్రిక్:
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ నవీన్ మార్కెట్ అగ్రస్థాయికి చేరింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. నవీన్ నటించిన గత రెండు చిత్రాలు కూడా మిలియన్ డాలర్ క్లబ్‌లో ఉండటంతో, అమెరికాలో వరుసగా మూడు సినిమాలు మిలియన్ మార్కు దాటిన అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.
విజయానికి కారణం ఏమిటి?
దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. క్లీన్ కామెడీతో పాటు కుటుంబ భావోద్వేగాలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.

