Nayanthara Wields a Gun: గన్ పట్టిన నయనతార .. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల
పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల

Nayanthara Wields a Gun: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్" . 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుండి బుధవారం ఒక భారీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార 'గంగ' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడిస్తూ మేకర్స్ ఒక స్ట్రైకింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు.
విడుదలైన కొత్త పోస్టర్‌లో నయనతార ఒక గ్రాండ్ క్యాసినో ఎంట్రన్స్ వద్ద నిలబడి, చేతిలో గన్ పట్టుకుని అత్యంత గంభీరంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఆమె పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో సూచిస్తోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "నయనతారను ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త కోణంలో ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. ఆమె నటనలో ఉన్న లోతు, నిజాయితీ ఈ పాత్రకు ప్రాణం పోశాయి. గంగ పాత్ర కోసం నేను వెతుకుతున్న వ్యక్తి నయనతారలో కనిపించింది" అని ప్రశంసించారు.
'కేజీఎఫ్: చాప్టర్ 2' తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ 'నాడియా'గా, హుమా ఖురేషీ 'ఎలిజబెత్'గా నటిస్తున్నారు. యశ్, గీతూ మోహన్ దాస్ స్వయంగా ఈ కథను రాశారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ గ్రహీత రాజీవ్ రవి ఛాయాగ్రహణం అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. యాక్షన్ విభాగంలో 'జాన్ విక్' ఫేమ్ హాలీవుడ్ డైరెక్టర్ జెజె పెర్రీతో పాటు అన్బరివ్ బృందం పనిచేస్తుండటం విశేషం.
కేవీఎన్ ప్రొడక్షన్స్ , మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2026, మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

