Niharika Konidela: డ్రెస్సింగ్ స్టైల్‌పై నిహారిక షాకింగ్ కామెంట్స్: "ఇంట్లో ఒకలా.. బయట మరోలా!"
"ఇంట్లో ఒకలా.. బయట మరోలా!"

Niharika Konidela: నిహారిక కొణిదెల తన డ్రెస్సింగ్ స్టైల్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. మహిళల దుస్తుల ఎంపిక అనేది వారి వ్యక్తిగత ఇష్టమని చెప్తూనే, మనం ఉండే సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకోవడం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఈ విషయంపై స్పందిస్తూ.. మన ఇంటి నాలుగు గోడల మధ్య మనకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛ మనకు ఉంటుందని, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం సమాజంలో మనకు ఉండే సంబంధ బాంధవ్యాలను, మన చుట్టూ ఉన్న పరిసరాలను దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. మనం వెళ్లే చోటుకి తగినట్లుగా మన ఆహార్యం ఉండటం గౌరవప్రదంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
తను కూడా సందర్భాన్ని బట్టే దుస్తులు ధరిస్తానని నిహారిక వివరించారు. ఉదాహరణకు పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు చీర కట్టుకోవడానికి ఇష్టపడతానని, అదే సమయంలో పార్టీలకు లేదా పబ్‌లకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో వెళ్లనని స్పష్టం చేశారు. ఎక్కడ ఎలా ఉండాలో అది మన విచక్షణపై ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, నిహారిక ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నారు. ఆమె నిర్మాణంలో తెరకెక్కుతున్న "రాక్షస" సినిమా ఏప్రిల్ 3న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

