Nithiin’s Alias Rukmini: నితిన్ అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
వచ్చేది ఎప్పుడంటే?

Nithiin’s Alias Rukmini: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం అలియాస్ రుక్మిణి విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తుండగా, నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు సినిమాలో అసలు రుక్మిణి పాత్ర ఎవరు పోషిస్తున్నారనే విషయాన్ని అక్టోబర్ 13న రివీల్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించి క్యూరియాసిటీని పెంచింది.
ఆకట్టుకున్న టైటిల్ గ్లింప్స్
ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. దర్శకుడు మురళీ కాంత్, నాని మధ్య కథా చర్చలతో సాగే ఈ వీడియోలో.. ఇదొక కృష్ణుడి కథ అని చెప్పడం, అక్కడ కనిపించే పుస్తకాలన్నీ రుక్మిణి రాసినవని తెలుసుకుని "ఎవరీ రుక్మిణి?" అని నాని ప్రశ్నించడం హైలైట్‌గా నిలిచింది. సరిగ్గా అదే సమయంలో నిద్రలేచిన నితిన్.. "రుక్మిణి నా భార్య" అని సమాధానం ఇవ్వడంతో వీడియో ముగుస్తుంది. ఈ కాన్సెప్ట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం నేరుగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని నితిన్ స్వయంగా పేర్కొన్నారు.
ముగిసిన తొలి షెడ్యూల్
సెప్టెంబర్‌లో పది రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో నితిన్‌తో పాటు ప్రముఖ నటులు సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
టైటిల్‌తోనే వైవిధ్యాన్ని చాటిన ఈ చిత్రం నుంచి అక్టోబర్ 13న రివీల్ కానున్న రుక్మిణి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద నితిన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

