Nithya Menen Turns Producer: నిర్మాతగా నిత్యా మీనన్ ఆరంభం': 15 ఏళ్ల ప్రయాణం.. కొత్త వెలుగులో 'కీయురి'!
కొత్త వెలుగులో 'కీయురి'!

Nithya Menen Turns Producer: తన సహజ సిద్ధమైన నటనతో జాతీయ అవార్డును అందుకున్న నటి నిత్యా మీనన్ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. నటిగా ఎన్నో చిరస్మరణీయ పాత్రలు పోషించిన ఆమె, ఇప్పుడు నిర్మాతగా మారి కీయురి ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, తన సంస్థ లోగో వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
సృజనాత్మకతకు కొత్త రూపం కీయురి
నిర్మాతగా మారడం వెనుక తనకున్న బలమైన ఉద్దేశాన్ని నిత్యా ఈ సందర్భంగా వివరించారు. కీయురి అంటే భూమి గుహల నుంచి పుట్టి, రాతితో చెక్కబడిన, కాంతిని ప్రేమించే ఒక రూపం లేని శక్తి అని ఆమె తెలిపారు. సినిమా అంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదని, చూసే ప్రేక్షకుడిలో ఒక మార్పును, పరివర్తనను తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. తన నిర్మాణ సంస్థ ద్వారా అటువంటి నాణ్యమైన చిత్రాలనే అందిస్తానని స్పష్టం చేశారు.
అలా మొదలైంది జ్ఞాపకాలు..
తను నిర్మాతగా మారిన తరుణంలో, తన తొలి తెలుగు సినిమాఅలా మొదలైంది విడుదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని నిత్యా ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి తాము చేసే రొమాంటిక్ కామెడీని ఎవరూ అర్థం చేసుకోలేదని, షూటింగ్ అయిపోయాక ఇరానీ చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లమని తెలిపారు. "నువ్వు ఇకపై ఇలా స్వేచ్ఛగా రెస్టారెంట్లకు రాలేవు" అని నందిని రెడ్డి అప్పట్లో అన్న మాటలు విన్నప్పుడు తనకు వింతగా అనిపించిందని, కానీ ఆ సినిమా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె పేర్కొన్నారు.నటిగా గ్లామర్ కంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఓటు వేసే నిత్యా మీనన్, నిర్మాతగా కూడా సరికొత్త ఆలోచనలతో సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

