Ram Charan’s ‘Peddi’: కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. 'పెద్ది'లో రామ్ చరణ్ విశ్వరూపం!
'పెద్ది'లో రామ్ చరణ్ విశ్వరూపం!

Ram Charan’s ‘Peddi’: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం "పెద్ది" (Peddi) గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, అసలు కథకు మధ్య పెద్ద వ్యత్యాసమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్లలో చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించడంతో, ఇదొక రూరల్ స్పోర్ట్స్ డ్రామా అని అందరూ భావించారు. కానీ, లోపలి సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ పాత్ర కేవలం క్రికెటర్‌కు మాత్రమే పరిమితం కాదట.
ఈ సినిమాలో రామ్ చరణ్ కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా కుస్తీ (Wrestling) మరియు ఇతర గ్రామీణ క్రీడల్లో ఆరితేరిన వ్యక్తిగా కనిపిస్తారట. డబ్బు సంపాదన కోసం ఈ ఆటల్లో పాల్గొనే రగ్గడ్ క్యారెక్టర్‌లో చరణ్ మెరవనున్నారు. ముఖ్యంగా కథలో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయని, అందుకే చరణ్ తన బాడీని పూర్తిగా మార్చుకున్నారని సమాచారం.
కోచ్ శివోహమ్ పర్యవేక్షణలో రామ్ చరణ్ ఒక 'బీస్ట్' లాంటి భారీ కాయాన్ని సిద్ధం చేసుకున్నారు. "ఉప్పెన" ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కేవలం క్రీడల చుట్టూనే కాకుండా, బలమైన ఎమోషన్స్ మరియు పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లతో సాగుతుందట. సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్‌బమ్స్ తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సంగీత ప్రియులను అలరిస్తున్న ఈ చిత్రం నుండి రెండో సింగిల్ "రాయ్ రాయ్ రా రా"ను మార్చి 2న విడుదల చేయనున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామా మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

